Thursday, July 25, 2024

'మీకు దండం బాబూ ఒక్క రూపాయీ లేదు' - సీసీ కెమెరా ముందు దొంగ సైగలు, పెర్ఫార్మెన్స్ అదుర్స్ ఏమీ దొరక్క రూ.20 పెట్టి, సీసీ కెమెరాకు దండం పెట్టిన దొంగ...

Rangareddy News: ఓ దొంగ పక్కా ప్లాన్‌తో ఓ హోటల్‌లో చోరీకి వెళ్లాడు. అయితే, అక్కడ ఒక్క రూపాయి కూడా దొరక్క సీసీ కెమెరాల ముందు విచిత్రంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


Strange Thief Expressions Infront Of Cameras In Maheswaram: ఓ వ్యక్తి హోటల్‌లో చోరీ చేసేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యాడు. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక్కూడదనే ఉద్దేశంతో ముఖానికి మంకీ క్యాప్, చేతులకు గ్లౌజ్ ధరించి మొత్తానికి స్పాట్ వద్దకు చేరుకున్నాడు. సీరియస్‌గా చాకచక్యంగా తాళం పగలగొట్టిన దొంగ చాలాసేపు అక్కడ వెతికినా ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురై సీసీ కెమెరా ముందు విచిత్రమైన హావభావాలు ప్రదర్శించాడు. రంగారెడ్డి (Rangareddy) జిల్లా మహేశ్వరంలో (Maheswaram) ఈ ఘటన జరగ్గా.. సదరు దొంగ సీసీ కెమెరాల ముందు చేసిన  ఫెర్మార్మెన్స్ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.


రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందున్న ఓ హోటల్‌లో దొంగ చోరీ చేసేందుకు ముఖానికి మంకీ క్యాప్, చేతులకు గ్లౌజులతో సిద్ధమయ్యాడు. పకడ్బందీగా స్పాట్‌కు వెళ్లి పని కానిచ్చేద్దాం అనుకున్నాడు. తీరా తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చాలాసేపు వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా దొరకలేదు. తీవ్ర నిరాశకు గురైన సదరు దొంగ సీసీ కెమెరాల ముందు విచిత్రంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. 'ఏం సామీ మీకు దండం. ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఇంటికి వెళ్లేటప్పుడు హోటల్ యజమాని ఓ పదో పరకో పెట్టి వెళ్లకపోతే ఎలా.?' అన్న రీతిలో కెమెరాల ముందు హావభావాలు ప్రదర్శించాడు. అంతే కాకుండా ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ తీస్తూ.. 'ఇది తప్ప ఇంకే దొరకలేదు' అన్న రీతిలో కెమెరా ముందు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. మళ్లీ తిరిగి వచ్చి టేబుల్‌పై రూ.20 పెట్టి 'ఇదుగో వాటర్ బాటిల్ డబ్బులు కూడా పెట్టి వెళ్లిపోతున్నా'  అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సినిమాల్లో కమెడియన్లను మించిన పెర్ఫార్మెన్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ తెగ నవ్వుకుంటున్నారు.


Source From - https://telugu.abplive.com/

1 comment: